Komaram Bheem




మన రాష్ట్రంలో ఆదిలాబాద్‌ జిల్లా పురాణ కాలపు భీముడు, హిడింబల రాజ్యమని ప్రతీతి. ఇప్పటి గోండు జాతి సోదరీ సోదరులు వాళ్ల వంశీకులే అంటారు. ఆ ప్రాంతాన్ని గోండులు పరిపాలించినట్టు చారిత్రక రుజువులున్నాయి. జనహిత పాలన వాళ్లది. మైదాన ప్రాంతాన్నుంచి వచ్చిన షావుకార్లు బిస్కట్లు, మురుకులు, ఉప్పు, ువ్వెన్లు, తదితర వస్తువులను వస్తుమార్పిడి పద్ధతిలో అమ్ముతూ గోండులను నిలువుదోపిడీ చేసేవారు ఆ తర్వాత నైజాం రాజోద్యోగులు వాళ్లని పన్నుల పేరిట నానా రకాలుగా హింసించేవారు. అట్లాంటి దారుణమైన వాతావరణంలో ఓ గోండు
కుటుంబంలో జన్మించాడు కొమురం భీము. ఆదివాసీలందరికీ భీం కుటుంబమే పెద్దదిక్కు. కొమురం భీం తన పూర్వీకుల వీరోచిత గాథలు వింటూ పెరిగాడు. వాళ్ల వదిన భీం కు చిన్నప్పటినుంచే వీర గాథల్ని చెప్తూ అతని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది.


కూసే కూకు కూకూ (కూసే కోకిల కూకూ)
కేడా మావయి కూకూ (అడవి మనది కూకూ)
బీడూ మావయి కూకూ (బీడూ మనది కూకూ)
గోండు రాజ్యం కూకూ
మైసి వాకట్‌ కూకూ (గెలిచీ వస్తాం కూకూ)
తుడుం అంకత్‌ కూకూ (తడుం మోగించాలి కూకూ)
సచ్చుల దేశం కూకూ (మొత్తం దేశం కూకూ)
మైసి వాకట్‌ కూకూ (గెలిచీ వస్తాం కూకూ)


భీం వదిన కుకూ బాయి ఎప్పుడూ పాడే ఈ పాట అతణ్ని అమితంగా ప్రభావితం చేసింది.
'' వదినా ఈ నీళ్లు మనవి... ఈ గాలి మనది... ఈ ఎండ మనది... ఈ ఆకాశం మనది... మరి ఈ అడవి మనదెందుకు కాదు ? మన అడవి,
మన నేల, వాళ్లదెట్లా అయింది? '' అని అడిగేవాడు భీం.


ఆదివాసీలు పోడు వ్యవసాయం చేస్తూ తమ పంటల్ని రక్షించుకునేందుకు ప్రాణాలకు తెగించి అడవి మృగాలతో పోరాడుతుంటారు.
కానీ పంటలు చేతికందే సమయానికి నైజాం ప్రభుత్వ మానవ మృగాలు విరుచుకుపడి పంటలన్నింటినీ ఊడ్చుకుపోతుంటారు. కోళ్లను, మేకలను,
గొర్రెలను ఎత్తుకుపోతారు. ఎదురుతిరిగిన వాళ్ల చిత్రహింసలకు గురిచేస్తారు, వారిపై అక్రమ కేసులు బనాయిస్తుంటారు. గూడేలకు గూడేలనే
తగులబెడ్తుంటారు.


ఈ అన్యాయాలను సహించలేక కొమురం భీం తిరుగుబాటు బాటపడ్తాడు. ఆ క్రమంలో శత్రుపక్షంలో ఒకడ్ని చంపేస్తాడు. శత్రువులకు చిక్కకుండా
తప్పించుకునేందుకు గూడెంను వదిలి దేశాటన చేస్తాడు.
బతుకు గమనంలో అక్షరం నేర్చుకుంటాడు. భాషలు నేర్చుకుంటాడు. ఉద్యమాలతో అతనికి పరిచయం కలుగుతుంది. అ ల్లూరి సీతారామరాజు
వీరోచిత గాథ విని ఉత్తేజం పొందుతాడు. ఆ చైతన్యంతో తిరిగి తన ఊరుకు చేరుకుని తోటి ఆదివాసీలను చైతన్యపరుస్తాడు. తనవాళ్లని స్వేచ్ఛా
స్వాతంత్య్రం దిశలో నడిపిస్తాడు.


మొదట తమ సమస్యల పరిష్కారానికి సాత్వికంగా సర్కారుకు విన్నపాలు సమర్పిస్తాడు. కానీ సర్కారు ఆ విన్నపాలను బుట్టదాఖలు చేసి
అణచివేత మార్గాన్ని అనుసరిస్తుంది. దాంతో ఇక లాభం లేదని యుద్ధానికి సిద్ధమవుతాడు కొమురం భీం. సర్కారుతో అరివీర భయంకరంగా
పోరాడి పాక్షిక విజయం సాధిస్తాడు. అయితే నైజాం సర్కారు ఆయుధ సంపత్తి ముందు ఎక్కువ కాలం నిలబడలేకపోతాడు. పైగా స్వపక్షంలో
కొందరు ద్రోహులు వెన్నుపోటు పొడవడంతో కొమురం భీం ఆ వీరోచిత పోరాటంలో అమరుడవుతాతు.


కొమురం భీం జానపద హీరో కాదు. ఓ చారిత్రక రోల్‌ మాడల్‌ మాత్రమే కాదు. నేటికీ జనం గుండెల్లో సజీవంగా వున్న యోధుడు. ఆ పల్లె
ప్రాంతాల్లో ఇప్పటికీ ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఆయన వీర గాథను వినిపిస్తూనే వుంటారు.

0 comments:

Post a Comment

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Lady Gaga, Salman Khan